నేడు గెలీలియో గెలీల (Galileo Galilei ) జయంతి.

Spread the love

నేడు గెలీలియో గెలీల (Galileo Galilei ) జయంతి.

గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో 15 – 02 – 1564 న జన్మించాడు.
చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.

అరిస్టాటిల్ తో విభేదం.
గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు. గురుత్వ త్వరణం గూర్చి ఆ కాలం నాటికే అర్థం చేసుకోగలిగాడు.

గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించ గలిగాడు. 20 సంవత్సరాల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వ్రేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు.
గెలీలియో కాలంనాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికి ఈయన డోలన కాలాలను గణించటం విశేషం. వైద్య విద్యార్థి కాబట్టి, నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటం పై పరిచయం ఉంది కాబట్టి కాలనిర్ణయాన్ని తేలికగా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో “పల్స్ మీటరు” రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెన్జీ గోడ గడియారాన్ని తయారు చేశాడు. ఈ వాళ మనం వాడుతున్న పెండులం క్లాక్ కు కూడా మూలసూత్రం యిదే.

1610లో గెలీలియో పరిశీలించిన శుక్రగ్రహ ఉపగ్రహాలు.
పాడువా విశ్వవిద్యాలయం..
ఫ్లారెన్స్ లో గెలీలియో శిల్పం.
ఈ ప్రయోగం మూలంగా అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని నమ్మే పీసా విద్యాలయ మేధావులను ఇబ్బంది పెట్టింది. అందువలన స్వేచ్ఛ, సౌకర్యాలు కొరవడిన గెలీలియో అక్కడనుండి పాడువా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రధానాచార్యునిగా చేరారు. అక్కడే గెలీలియో యాంత్రిక శాస్త్రం రచించారు. ఇది సామాన్యులకు కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులు సులభంగా ఎత్తడానికి ఉపకరించింది.

పాడువా లోనే గెలీలియోకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో డబ్బుకోసం కొత్త విషయాలను ఆవిష్కరించడం ఒక్కటే అతనికి మార్గంగా కనిపించింది. ఆ సమయంలోనే వాయు థర్మామీటర్ ను, పల్లపు ప్రాంతం నుంచి ఎత్తుకు నీటిని చేరవేసి వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాన్ని, గణితంలో వర్గాలు, వర్గమూలాలు కనుగొనే కంపాస్ పరికరాన్ని కనుగొన్నారు. ఆ సమయంలోనే లోలకాలు, వాయుతలాలపై కూడా కీలకమైన ప్రయోగాలు చేశారు.

టెలిస్కోప్..
గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.

విశ్వ రహస్యాలు…
ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు.గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు.ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతంను బలపరిచాడు. క్రీ.శ 1616 లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించాడు.

మతాధికారుల ఆగ్రహం..
అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి, కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. ఐతే రెండు సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. దీంతో క్రీ.శ.1630 వరకు గెలీలియో నోరు విప్పలేక పోయాడు. అయినా ఆయన తన వాదాలను విడిచి పెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన ఈ “Dialogues concerning the two chief world systems” అనే గ్రంథం ఐరోపా ఖండంలో సారస్వత వేదాంత గ్రంథానికి ఉదాహరణగా పేర్కొంటారు.

నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. క్రీ.శ. 1637 లో పాపం గెలీలియో గ్రుడ్డివాడయ్యాడు. ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొంది.

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *